నటుడిగా జీవా తెలుగు చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన కళ్లే ఆయనకు ఎస్సెట్. కళ్లతోనే ఆయన భయపెట్టేస్తారు. ఆ కళ్లవల్లే ఆయనకు ఆదిలో విలన్ అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత తన పర్ఫార్మెన్స్‌తో అలరిస్తూ, రకరకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు. అలాంటి ఆయనకూ ఓ లవ్ స్టోరీ ఉందనీ, తను ప్రేమించిన యువతినే ఆయన పెళ్లి చేసుకున్నారనీ చాలా మందికి తెలీదు. అసలు ఆయన కళ్లను చూసి, ఎవరు ప్రేమిస్తారనే సందేహమూ వస్తుంది. కానీ అది నిజం. ఆయనది ప్రేమ వివాహం.
అంతేనా.. పెళ్లికి ముందు మద్రాసులో సినిమా వేషాల కోసం తిరుగుతూ ఆర్థిక కష్టాలు ఎదురైనప్పుడల్లా జీవాను ఆమే ఆదుకుంటూ వచ్చారు! జీవా స్వస్థలం గుంటూరు. ఆయన ఇంటి దగ్గరల్లోనే బండ్లమూడి హనుమాయమ్మ స్కూలు ఉంది. ఆమె ఆ స్కూలు విద్యార్థిని. స్కూలు అయిపోయే టైమ్‌కు దారికాచి ఆమెకు లైన్ వేసేవారు జీవా. అక్కడ సుబ్బాయమ్మ బడ్డీ కొట్టు ఉంటే, ఏదో కొనుక్కోవడానికి వెళ్లినట్లు అక్కడకు వెళ్లేవారు జీవా. అక్కడ్నుంచి ఆమెను చూస్తూ ఉండేవారు. అలా ఇద్దరికీ చూపులు కలిశాయి. తన ప్రేమను ముందుగా ఆయనే వ్యక్తం చేశారు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
నటుడు కావాలనే కోరికతో గుంటూరు నుంచి మద్రాస్ వెళ్లారు జీవా. అప్పుడు ఆమె జిల్లా గ్రంథాలయ సంస్థలో ఉద్యోగిని. మద్రాస్‌లో జీవా హోటల్‌లో రూమ్ తీసుకొని వేషాల కోసం తిరిగేవారు. దగ్గరున్న డబ్బులు అయిపోతుంటే, ఆమెకు ఉత్తరం రాసేవారు. ఆమె డబ్బు పంపేవారు. అలా కొన్నాళ్లు గడిపాక, నటుడిగా వరుసగా వేషాలు వచ్చి, ఆర్థిక కష్టాలు తీరాక అప్పుడు ఆమెను వివాహం చేసుకున్నారు.